మైక్ టైసన్… అనగానే బాక్సింగ్ రింగ్‌లో పదునైన పిడిగుద్దులతో ప్రత్యర్థిని కుప్పకూల్చే మహాబలుని రూపం అందరికీ గుర్తుకు వస్తుంది. కోపంతో ఊగిపోతూ ఎదుటివారికి ముచ్చెమటలు పట్టించడం, బౌట్‌లో కనికరం లేకుండా ఎదురుదాడి చేయడం, గెలవడం కోసం చివరకు ప్రత్యర్థి చెవిని తెగేలా కొరకడం లాంటి పనులన్నీ ఒక్కొక్కటిగా కళ్ల ముందు మెదులుతాయి.
ఇవన్నీ 1980, 90 దశకాల్లో క్రీడాభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటనలు. ఆ సమయంలో బాక్సింగ్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు మైక్ టైసన్. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో 20 ఏళ్ల వయస్సులోనే డబ్ల్యూబీసీ హెవీ వెయిట్ చాంపియన్‌గా నిలిచిన ఏకైక బాక్సర్ అతను. ఒకే సమయంలో ఆయన వద్ద వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ (WBC), వరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్ (WBA), ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఫెడరేషన్ (IBF) టైటిళ్లు ఉన్నాయంటే రింగ్‌లో ఆయనెంత పవర్‌ఫుల్ బాక్సరో అర్థం చేసుకోవచ్చు.
కెరీర్‌లో ఆడిన 58 మ్యాచ్‌ల్లో 50 సార్లు విజయం ఆయననే వరించింది. బాక్సింగ్ రింగ్‌ను ఆయన ఎంతలా ఏలారో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. అందులో 44 మ్యాచ్‌ల్లో నాకౌట్ విజయాలు సాధించడం మరింత విశేషం. ఐరన్ మ్యాన్, కిడ్ డైనమేట్, ‘ద బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్’ అని ఆయనకున్న ముద్దుపేర్లే ఆయన వైఖరి ఎలాంటిదో తెలుపుతాయి.
చిన్నతనంలో ఎప్పుడూ గొడవలు, దొంగతనాల కేసులో జైలుకు వెళ్లిన కుర్రాడు… తర్వాత తన కసి, పట్టుదలతో బాక్సింగ్ ప్రపంచానికి రారాజయ్యాడు. తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకపోవడంతో టైసన్ బాల్యమంతా గందరగోళంగా గడిచింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయారు. ఇంట్లో గొడవలతో మొండిగా తయారైన అతను ఎఫ్పుడూ వీధి గొడవల్లో తలదూర్చేవాడు. ప్రతీ చిన్న విషయానికి విపరీతమైన కోపం తెచ్చుకునేవాడు. దీంతో అనవసర తగాదాలకు పోయి అందరిలో చెడ్డ బాలుడిగా పేరు తెచ్చుకున్నాడు.
అదే సమయంలో ‘కస్ డి అమాటో’ అనే ట్రైనర్ టైసన్‌ను చేరదీసి బాక్సింగ్‌లో రాటుదేలేలా తయారు చేశారు. అతనికి బతకడం ఎలాగో నేర్పించాడు. మాజీ చాంపియన్ ఫ్లాయిడ్ ప్యాటర్సన్ కెరీర్ ఎదుగుదలలో కూడా కస్ డి అమాటో కీలక పాత్ర పోషించారు. కెరీర్ ప్రతీ దశలోనూ టైసన్ వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొన్నాడు. సమస్య ఎదుర్కొన్న ప్రతీసారి కోపాన్నంతా బాక్సింగ్‌లో చూపించేవాడు. కారణాలేవైనా ఆయన ఇద్దరు భార్యలతో విడిపోయాడు. ప్రత్యర్థుల కుట్రలతో అత్యాచార కేసులో నిందితునిగా జైలు శిక్ష అనుభవించాడు. లెక్కలేనన్ని డబ్బులు సంపాదించి చివరకు పేదరికాన్ని కూడా అనుభవించాడు. ఒకానొక దశలో డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసగా మారాడు. ఆకాశానికి ఎక్కినట్లే ఎక్కి అంతలోనే అథ:పాతాళానికి దిగజారేవాడు. ఇలా టైసన్ జీవితమంతా సమస్యలమయం.